Harish Rao: పక్క రాష్ట్రంలోని రజనీకాంత్‌కు అర్థమైంది కానీ ఇక్కడి గజినీలకు అర్థం కాలేదు: హరీశ్ రావు

Harish rao on health expenditures in assembly

  • పదేళ్లలో వైద్య రంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామన్న హరీశ్ రావు
  • వైద్యానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి
  • ఏడాదిలో వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తామన్న మంత్రి

గత పదేళ్ల కాలంలో వైద్య రంగంపై తమ ప్రభుత్వం రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి హరీశ్ రావు శుక్రవారం శాసన సభలో తెలిపారు. వైద్యానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రంగానికి రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను దేశం మొత్తం ప్రశంసిస్తుంటే ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.

ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నామని, గతంలో మాదిరిగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తీవ్రంగా లేవన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడినట్లు చెప్పారు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల పేరుతో ప్రాథమిక దశ నుండి వైద్యం అందిస్తున్నామన్నారు.

నిమ్స్‌లో పడకలను 5 వేలకు పెంచుతామన్నారు. ఏడాదిలో వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కటే నిమ్స్ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో పక్క రాష్ట్రంలోని నటుడు రజనీకాంత్‌కు అర్థమైందని, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కాలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం ఉత్పత్తి, డాక్టర్ల తయారీలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తమకు బియ్యం ఇవ్వాలని అడుగుతున్నాయన్నారు.

  • Loading...

More Telugu News