Chittoor District: టీడీపీ శ్రేణులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: పుంగనూరు ఘటనపై జిల్లా ఎస్పీ
- దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఎస్పీ
- పుంగనూరులో ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు జరిగాయని వెల్లడి
- పోలీసులకు గాయాలైనట్లు చెప్పిన ఎస్పీ రిషాంత్ రెడ్డి
పుంగనూరులో ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు జరిగాయని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. బీరు బాటిల్స్, కర్రలు, రాళ్లతో రెండువేల మంది కార్యకర్తలు వచ్చారని, పోలీసులపై దాడి చేశారని తెలిపారు. వాళ్లు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాలని, కానీ అలా వెళ్లకుండా పుంగనూరులోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు.
టీడీపీ కేడర్ పుంగనూరులోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని, దీంతో ఒక్కసారిగా పోలీసులపై విచక్షణారహితంగా దాడి జరిగిందని చెప్పారు. రెండు పోలీస్ వాహనాలను తగులబెట్టారన్నారు. ఈ ఘటనలో 14 మంది పోలీసులకు గాయాలయ్యాయని, రాళ్ళ దాడిలో 50 మందికి పైగా గాయపడ్డారన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. దీని వెనుక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. రాజకీయ కక్షలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, కానీ పోలీసులపై ప్రతాపం చూపించడం కాదన్నారు.