Daggubati Purandeswari: విశాఖ విమానాశ్రయం రాత్రివేళ మూసివేతపై కేంద్రానికి పురందేశ్వరి లేఖ
- రక్షణ శాఖ అధీనంలో విశాఖ ఎయిర్ పోర్టు
- పదేళ్లకోసారి అభివృద్ధి పనులు
- రాత్రివేళల్లో రన్ వే మూసివేయాలని కేంద్రం నిర్ణయం
- మూసివేత వేళలు కుదించాలన్న పురందేశ్వరి
విశాఖ విమానాశ్రయం రన్ వే ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి లేఖ రాశారు. రన్ వే రాత్రిపూట మూసివేత కాలవ్యవధి అధికంగా ఉందని పేర్కొన్నారు.
పదేళ్లకోసారి జరిగే ఎయిర్ పోర్టు అభివృద్ధి పనుల కోసం రాత్రివేళ రన్ వే మూసివేయాలని రక్షణ శాఖ ప్రతిపాదించింది. దాంతో రాత్రివేళల్లో విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని రక్షణ శాఖ భావిస్తోంది.
తూర్పు తీర నగరం విశాఖలో నేవీ కేంద్రం ఉండడంతో, ఇక్కడి ఎయిర్ పోర్టును కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే నవీకరణ పనులు ఐదారు నెలల పాటు సాగనున్న నేపథ్యంలో పురందేశ్వరి స్పందించారు.
విశాఖ విమానాశ్రయం మూసివేత వేళలు కుదించాలని రక్షణ మంత్రికి రాసిన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ నిర్ణయం కారణంగా విశాఖ-సింగపూర్ విమానం, మరో 12 విమాన సర్వీసులు నిలిచిపోతాయని వెల్లడించారు. దేశీయంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, పూణే నగరాలకు విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
విశాఖ ఆర్థిక వ్యవస్థ, వివిధ రకాల వాణిజ్యంపై ప్రభావం పడుతుందని పురందేశ్వరి వివరించారు. అందుకే, విమానాశ్రయాన్ని రాత్రి 10.30 గంటల వరకు తెరిచే ఉంచాలని, తిరిగి ఉదయం 6.30 గంటల నుంచి కార్యకలాపాలు సాగించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.