Manipur Riots: మణిపూర్‌లో మళ్లీ హింస.. బిష్ణుపూర్‌లో ముగ్గురి మృతి.. తగలబడుతున్న ఇళ్లు
- గత రాత్రి జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మెయిటీల మృతి
- కుకీల ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- మొన్న జరిగిన గొడవల్లో 17 మందికి గాయాలు
- మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా మృతి
మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతానికి రెండు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న బఫర్‌జోన్ వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.
ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. తమపైకి దూసుకొచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సాయుధ బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. కాగా, మణిపూర్‌లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.