TSRTC: ముగిసిన టీఎస్ఆర్టీసీ కార్మికుల నిరసన.. ప్రారంభమైన బస్సు సర్వీసులు
- ఉదయం 6 నుంచి 8 వరకూ వివిధ డిపోల్లో ఆర్టీసీ కార్మికుల నిరసన
- ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలంటూ డిమాండ్
- ఉదయం 11.00 గంటలకు రాజ్‌భవన్ ఎదుట మరోమారు నిరసన కార్యక్రమం
టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6.00 గంటలకు ప్రారంభమైన నిరసన కార్యక్రమం 8.00కి ముగిసింది. దీంతో, పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు యథాతథంగా ప్రారంభమయ్యాయి.
కార్మికుల నిరసనతో ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఫలక్‌నుమా, ఫరూక్ నగర్, తదితర డిపోల్లో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తమ సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కాగా, రాజ్‌భవన్ వద్ద ఉదయం 11.00 గంటలకు మరోసారి నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. గ్రేటర్‌లోని కార్మికులు 10 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది.
ఆర్టిసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిల్లు రూపొందించిన ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇది ఆర్థిక బిల్లు కావడంతో అనుమతి కోసం రెండు రోజుల క్రితం గవర్నర్‌కు పంపించింది. బిల్లుకు ఇప్పటికీ అనుమతి లభించకపోవడంతో కార్మికులు, సిబ్బంది నిరసన కార్యక్రమానికి తెరతీశారు.