BPL cards: సొంత కారు ఉంటే రేషన్ కార్డు రద్దు.. కర్ణాటక సర్కారు నిర్ణయం
- వైట్ బోర్డ్ కారుంటే బీపీఎల్ కార్డుకు అనర్హులని ప్రకటన
- ఉపాధి కోసం కొనుగోలు చేసిన వారికి మినహాయింపు
- సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు 10 కిలోల బియ్యం
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులలో అనర్హులను ఏరివేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సొంత కారు ఉన్న కుటుంబాలకు బీపీఎల్ కార్డును రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంట్లో వైట్ బోర్డ్ కారు ఉంటే బీపీఎల్ కార్డుకు అనర్హులని, ఇప్పటికే ఉన్న కార్డులను తొలగిస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప పేర్కొన్నారు. ఉపాధి కోసం కారును కొనుగోలు చేసిన కుటుంబాలకు మినహాయింపు ఉంటుందని మంత్రి చెప్పారు. ఈమేరకు శుక్రవారం విధాన సభలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని బీపీఎల్ కార్డుదారులకు ప్రస్తుతం 5 కిలోల బియ్యం, మరో 5 కిలోలకు సంబంధించి నగదును అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ నుంచి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన బియ్యం కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి మునియప్ప వివరించారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.