MS Dhoni: వర్ధమాన క్రికెటర్ల కోసం హైదరాబాద్‌లో స్కూల్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించిన ధోనీ క్రికెట్ అకాడమీ
- ఈ నెల 27 నుంచి తొలి సీజన్ పోటీలు
- 20వ తేదీన హైదరాబాద్‌లో సెలెక్షన్స్
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన భారత క్రికెటర్ షేక్ రషీద్
భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దేశ విదేశాల్లో అకాడమీలు స్థాపించాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) పేరిట హైదరాబాద్‌లోనూ ఓ సెంటర్ ఏర్పాటైంది. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. రాంచీ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన ధోనీ ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రతిభావంతులను వెలికి తీసి వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ టీ20 లీగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీలోని యువ క్రికెటర్ల కోసం అండర్-14, అండర్16 స్థాయిలో ఈ నెల 27 నుంచి టీ20 లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్ కు సంబంధించిన పోస్టర్ ను అండర్19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఆవిష్కరించాడు. ఏపీకి చెందిన ఈ యువ క్రికెటర్ ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు.
ఇలాంటి లీగ్‌ల్లో ఆడడం వల్ల ప్రతిభ గల క్రికెటర్లు త్వరగా వెలుగులోకి వస్తారని రషీద్ చెప్పాడు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లు లేవని, ఎక్కడ టోర్నమెంట్లు జరుగుతున్నాయో, వెతుక్కుని ఆడేవాడినని తెలిపాడు. సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని, ఈ లీగ్‌లో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రషీద్ కోరాడు. లీగ్‌లో ఆడాలనుకునే క్రీడాకారులు 7396386214, 7618703508 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపాడు. ధోనీ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే స్కూల్ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్షన్స్‌ను నిర్వహించనున్నారు. లీగ్‌లో సత్తా చాటిన ఐదుగురు టాప్ ప్లేయర్లకు ఆరు నెలల ఉచిత శిక్షణతో పాటు ఐదు లక్షల స్కాలర్ షిప్ కూడా ఇస్తారు.