Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేవాడే!: పవన్ కల్యాణ్
- జనసేన గల్ఫ్ ప్రతినిధులతో పవన్ సమావేశం
- రూ.1 కోటి విరాళం అందించిన గల్ఫ్ ప్రతినిధులు
- ఏపీలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవన్న పవన్
- గల్ఫ్ లో బతకగలిగిన మనం ఇక్కడ బతలేకపోతున్నామని ఆవేదన
- అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొందని వెల్లడి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనసేన పార్టీకి గల్ఫ్ ప్రతినిధులు అందించిన కోటి రూపాయల విరాళాన్ని పవన్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవని అన్నారు. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే, చెప్పుకోవడానికి తెలిసిన పోలీసు అధికారైనా ఉండాలి, లేదా సొంత కులానికి చెందినవాడు ఎమ్మెల్యే అయి ఉండాలి అని పవన్ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయాల్లో కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు కూడా బెదిరించేవారేనని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతకలేకపోతున్నాం? అన్నారు. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యం అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.