Bhuma Akhila Priya: నా రక్తంలోనే నంద్యాల ఉంది: భూమా అఖిలప్రియ
- నంద్యాలకు వెళ్లవద్దని చంద్రబాబు చెప్పలేదని వెల్లడి
- ఈ నియోజకవర్గానికి దూరమయ్యే ప్రసక్తి లేదన్న అఖిల
- రాయలసీమను రాక్షససీమగా మారుస్తున్నారని ఆగ్రహం
తనను నంద్యాలకు వెళ్లవద్దని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా జరిగిన ప్రచారాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఖండించారు. తనను నంద్యాలకు వెళ్లవద్దని చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి పుకార్లను పట్టించుకోనని తెలిపారు. నంద్యాల అనేది తన రక్తంలోనే ఉందని, ఈ నియోజకవర్గానికి దూరమయ్యే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమను ఈ ప్రభుత్వం మళ్లీ రాక్షససీమగా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, 2014లో తల్లి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ వైసీపీ నుండి ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో టీడీపీలో చేరారు. 2019లో ఆళ్ళగడ్డ నుండి పోటీ చేసి ఓడిపోయరు. అయితే భూమా కుటుంబానికి ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో పట్టు ఉంది. దీంతో నంద్యాలపైనా దృష్టి సారించారు. నంద్యాల నుండి 2014లో భూమా నాగిరెడ్డి, 2017 ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019లో మాత్రం వైసీపీ నుండి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గెలిచారు.