railway stations: 508 రైల్వే స్టేషన్ల పునర్ నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని

PM Modi lays foundation stone for redevelopment of 508 railway stations across country
  • ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన కార్యక్రమం
  • ప్రయాణ సాధనంగా రైల్వేకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రధాని
  • తెలంగాణ నుంచి 21, ఏపీ నుంచి 18 స్టేషన్ల అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల నవీకరణ (పునర్ నిర్మాణ/అభివృద్ధి) పనులను ప్రారంభించారు. ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ కార్యక్రమం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ పనులను కేంద్ర రైల్వే శాఖ చేపట్టింది. 

ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. భారత రైల్వే స్టేషన్లు ఆధునికీకరణకు నోచుకోనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తాము ప్రయాణించేందుకు రైల్వేకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రపంచస్థాయి అవసరాలను కలిగించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. 

ఈ ప్రారంభోత్సవానికి ముందు రోజు అంటే శనివారం ప్రధాని దీనిపై ఓ ట్వీట్ కూడా చేశారు. ‘‘రేపు (ఆగస్ట్ 6న) రైల్వే రంగానికి చరిత్రాత్మక రోజు. ఉదయం 11 గంటలకు 508 స్టేషన్ల పునర్ అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నాం. రూ.25,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులు రైలు మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు. 

508 స్టేషన్లలో తెలంగాణ నుంచి 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 18 స్టేషన్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఏపీలో కాకినాడ టౌన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూల్ సిటీ, దేవరకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, భీమవరం టౌన్, ఏలూరు, నర్సాపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లి గూడెం ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రం నుంచి అభివృద్ధికి నోచుకోనున్న స్టేషన్లలో.. ఆదిలాబాద్, ఖాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హుప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, రామగుండం, మల్కాజ్ గిరి జంక్షన్, తాండూర్, యాదాద్రి ఉన్నాయి. 
railway stations
redevelopment
foundation
Prime Minister
Narendra Modi
Andhra Pradesh
Telangana

More Telugu News