Ajit Doval: భారతదేశానికి అంతకంటే సంతోషం ఇంకేదీ ఇవ్వదు..: అజిత్ దోవల్
- ఉక్రెయిన్ అంశంపై సౌదీలో జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు
- భారత్ నుంచి హాజరైన అజిత్ దోవల్
- శాంతిని నెలకొల్పేందుకు చర్చలే సరైన మార్గమని తాము నమ్ముతామన్న దోవల్
ఉక్రెయిన్– రష్యా యుద్ధంపై చర్చించేందుకు వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో భారత్ తరఫున అజిత్ దోవల్ పాల్గొన్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ భేటీకి 42 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. రష్యాకు మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ మీటింగ్‌లో అజిత్ దోవల్ మాట్లాడారు.
చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత విధానమని అజిత్ దోవల్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు చర్చలే సరైన మార్గమని భారత్ నమ్ముతుందని చెప్పారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆ రెండు దేశాలతో భారత్ చర్చిస్తోంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తోంది” అని వివరించారు. ఇరుదేశాలు సంక్షోభానికి ముగింపు పలికితే.. భారతదేశానికి అంతకంటే సంతోషం, సంతృప్తిని ఏదీ ఇవ్వదని అన్నారు.