Centre: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న డీఏ
- ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ
- దీన్ని 45 శాతానికి పెంచొచ్చని సమాచారం
- పెంచితే కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
కేంద్ర సర్కారు ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని సుమారు 3 శాతం వరకు పెంచనుంది. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏని 45 శాతం చేయనుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతుంటాయి. కరువు భత్యాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను సర్కారు పరిగణనలోకి తీసుకుంటుంది.
తాము అయితే 4 శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం 3 శాతం పెంచి 45 శాతానికి చేర్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. డీఏ పెంచితే జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర సర్కారు చివరి విడత ఈ ఏడాది మార్చి 24న డీఏని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీన్ని 2023 జనవరి 1 నుంచి అమలు చేసింది. పెరిగే ధరలకు పరిహారంగా డీఏ రూపంలో ఎప్పటికప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు అందిస్తుంటాయి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు అనుసరిస్తుంటాయి.