Kantirana Tata: విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకు అనుమతి లేదు: బెజవాడ సీపీ కాంతిరాణా టాటా
- విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం
- ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జేఏసీ
- ఈ నెల 8న ఛలో విద్యుత్ సౌధ
- విజయవాడలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయన్న సీపీ
విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు, మహా ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విద్యుత్ జేఏసీ, ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మహా ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. విద్యుత్ జేఏసీ చేపట్టిన ఛలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. విజయవాడలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ధర్నాలో పాల్గొనే ఉద్యోగులపై ఎస్మా చట్టం కింద చర్యలు ఉంటాయని తెలిపారు.