Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
- గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలుపై దాడి
- బారాబంకీలోని సఫేదాబాద్ స్టేషన్ సమీపంలో ఘటన
- గత నెలలో అయోధ్యలోనూ రైలుపై రాళ్లదాడి
ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై నిన్న రాళ్లదాడి జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. బారాబంకీలోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. దాడిలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
దాడి ఘటనపై బారాబంకీ రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఎలాంటి పరిస్థితులు కనిపించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడంతోపాటు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, గత నెలలో అయోధ్యలోనూ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది.