Australia: అక్టోబరులో జరిగే వరల్డ్ కప్ కు ముందుగానే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
- భారత్ లో అక్టోబరు 5 నుంచి వన్డే ఫార్మాట్ వరల్డ్ కప్
- 18 మందితో ప్రాథమిక జట్టును ప్రకటించిన ఆసీస్
- స్టార్ బ్యాట్స్ మన్ లబుషేన్ కు దక్కని చోటు
- తన్వీర్ సంఘా, ఆరోన్ హార్డీ వంటి కొత్త ముఖాలకు జట్టులో స్థానం
భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ఫార్మాట్ లో వరల్డ్ కప్ జరగనుండగా, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అప్పుడే జట్టును కూడా ప్రకటించేసింది. 18 మందితో ప్రకటించిన ఈ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
టెస్టుల్లో ఆసీస్ జట్టుకు మూలస్తంభంలా నిలిచే మార్నస్ లబుషేన్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జట్టును ప్రాథమిక ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేసినందున తదుపరి మార్పులు, చేర్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పటివరకు జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా ఆసీస్ వరల్డ్ కప్ జట్టులో బెర్తు కొట్టేయడం విశేషం. భారత్ లో స్పిన్ పిచ్ లను దృష్టిలో ఉంచుకుని సంఘాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవంలేని ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ ఎంపిక కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఐసీసీ నియమావళి ప్రకారం సెప్టెంబరు 28 నాటికి వరల్డ్ కప్ లో ఆడే అన్ని దేశాలు తమ తుది జట్లను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో, అప్పటికి ఆసీస్ జట్టు నుంచి కొందరికి ఉద్వాసన పలకడం, మరికొందరికి స్థానం కల్పించడం జరగొచ్చని భావిస్తున్నారు.
ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా అక్టోబరు 8న ఆతిథ్య భారత్ తో చెన్నైలో జరిగే మ్యాచ్ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఇటీవల యాషెస్ లో గాయపడిన నేపథ్యంలో, అతడికి రాబోయే మ్యాచ్ ల్లో విశ్రాంతి కల్పించనున్నారు.
వరల్డ్ కప్ కు సన్నాహకంగా కంగారూలు వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో 5 వన్డేల సిరీస్ ఆడనున్నారు. సంఘా, ఆరోన్ హార్డీ వంటి కొత్త ముఖాలను ఈ సిరీస్ లో ఆడించి, అంతర్జాతీయస్థాయిలో వారి ఆటను అంచనా వేయనున్నారు.