Chandrababu: ఇప్పుడైతే పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు: చంద్రబాబు
- చింతలపూడి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
- చింతలపూడి ఎందుకు పూర్తిచేయలేకపోయారని నిలదీసిన టీడీపీ అధినేత
- వైఎస్ నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని వెల్లడి
ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. చింతలపూడి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలంటూ నిలదీశారు.
గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు. 4.8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు వివరించారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం రూ.2,289 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిపై చంద్రబాబు పట్టిసీమ, పోలవరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. 2004 నుంచి పాలకుల వైఖరి కారణంగా ప్రాజెక్టు రెండుసార్లు బలైందని విచారం వ్యక్తం చేశారు.
2004లో మధుకాన్, శీనయ్య సంస్థలకు టెండర్లు దక్కాయని, కానీ కక్ష సాధింపు చర్యలతో అప్పటి పనులు రద్దు చేశారని చంద్రబాబు వెల్లడించారు. కమీషన్ల కోసం కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. పోలవరంలో 2004 నుంచి 2014 వరకు జరిగింది ఐదు శాతం పనులేనని స్పష్టం చేశారు. అసలు , పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థాయికి ఈ ప్రభుత్వం చేరుకుందని వివరించారు.
2021 నుంచి అనేక తేదీలు ప్రకటిస్తూ వచ్చారని, కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పోలవరం పనులు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడైతే... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.