Chandrababu: జగన్ క్షమించరాని నేరం చేశారు... పోలవరం వద్ద చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్

Chandrababu selfie challenge at Polavaram project

  • సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • విపక్ష నేత హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన
  • జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శలు
  • వర్షాకాలం పూర్తయితే జగన్ పని అయిపోయినట్టేనన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కొనసాగుతోంది. నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. 

పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ... జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు. ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని వివరించారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. 

కాఫర్ డ్యామ్ గ్యాప్ లు పూర్తిచేయనందువల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు నీరు వెళ్లిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులు చేయలేదని అన్నారు. అసలు, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న రెండేళ్లకు గానీ ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని స్పష్టం చేశారు. 

నిర్వాసితులకు రూ.19 లక్షలు ఇస్తానన్న జగన్... ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. పైగా, నిర్వాసితుల లబ్దిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పట్ల జగన్ క్షమించరాని నేరం చేశారని అన్నారు. పోలవరంపై చేసిన తప్పు ఒప్పుకుని ఇప్పటికైనా చెంపలేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

పోలవరం ఆపేందుకు గతంలోనూ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించకుండా ఢిల్లీలో జగన్ లాబీయింగ్ చేశారని వెల్లడించారు. అవాస్తవాలతో పోలవరంపై పుస్తకాలు ప్రచురించారని మండిపడ్డారు. 

జగన్ అధికారం చేపట్టాక కమీషన్ల కోసం కాంట్రాక్టరును కూడా మార్చారని తెలిపారు. కాంట్రాక్టరును మార్చడం కోసం జగన్ బంధువుతో విచారణ చేయించారని చంద్రబాబు వివరించారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. 

"ఈ వర్షాకాలం పూర్తయితే జగన్ పని కూడా అయిపోయినట్టే. రాష్ట్రానికి జీవనరేఖ వంటి ప్రాజెక్టును విషాదభరితం చేశారు. పోలవరం పట్ల పేకాటలో జోకర్ తరహాలో వైసీపీ పాలకుల వైఖరి ఉంది" అని వ్యాఖ్యానించారు. 

పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే తనను పోలవరానికి అనుమతించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబు విపక్ష నేత హోదాలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News