Chandrababu: పోలవరం పూర్తి కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి: చంద్రబాబు
- పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
- పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు
- సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్
- పోలవరం పూర్తి చేయడమే తన లక్ష్యమన్న చంద్రబాబు
- నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళతానని ఉద్ఘాటన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ సెల్ఫీ దిగి సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు.
పోలవరం సహా, యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు ఎలా నిర్మించాలో ఆచరణలో చేసి చూపించామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం ఎంతగా కష్టపడ్డామో, ఇప్పుడున్న చేతగాని ప్రభుత్వం వల్ల జాతీయ ప్రాజెక్ట్ కు ఎంత నష్టం జరిగిందో చూస్తున్నామని తెలిపారు.
"పోలవరం పూర్తి కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే, ఏపీలో తగ్గిపోయింది. నా సంకల్పానికి ఎవరూ అడ్డు రాలేరు. పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే వరకు ఆగేది లేదు. గోదావరిలో వృథాగా పోయే నీటిని రాష్ట్రావసరాలకు వినియోగించుకోవడంపై ఎవరూ అభ్యంతర పెట్టలేరు. పెట్టినా ఉపయోగం ఉండదు" అని స్పష్టం చేశారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముఖ్యాంశాలు
• ఈ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం సమస్యాత్మకంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించాడని బ్రిటీష్ వాడు అయినప్పటికీ ఇక్కడి ప్రజలు కాటన్ దొరను తమ హృదయాల్లో నిలుపుకున్నారు.
• ప్రజల కోసం, కరవు కాటకాలు లేకుండా చేయడం కోసం అతను మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో ఈ ప్రాంతం సస్యశ్యామలైంది. అభివృద్ధికి నమూనాగా నిలిచింది.
• రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులతోపాటు 69 ఉపనదులున్నాయి. గోదావరి నది అటు శ్రీకాకుళం, ఇటు రాయలసీమలోని నదులకు మధ్యలో ఉంటుంది. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే, రాష్ట్రానికి నీటి సమస్యే ఉండదు.
• రాష్ట్రానికి వరం పోలవరం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నాగావళికి, వంశధారకు కనెక్ట్ అవుతుంది. కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు అందించాం. కృష్ణాడెల్టాకు అందించాల్సిన 120 టీఎంసీల నీటిని శ్రీ శైలంనుంచి రాయలసీమకు తరలించాం.
• పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. స్వర్గీయ ఎన్టీఆర్ చొరవతో తెలుగుగంగ, హంద్రీనీవా పూర్తయ్యాయి.
• నేను వచ్చాక ముచ్చుమర్రి పూర్తి చేశాను. ఈ మూడు కే.సీ. కెనాల్ ద్వారా బనకచర్ల వద్ద కలుస్తాయి.
• పోలవరంతో పాటు చింతలపూడి లిఫ్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రం సుభిక్షమయ్యేది. ఈ ప్రభుత్వం రావడంతో చెప్పలేనంత నష్టం జరిగింది. పోలవరం ఒక చరిత్ర, ఒక కల.
పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపం...
• తొలిసారి బ్రిటీష్ ప్రభుత్వంలో 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పోలవరం నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. 1942 అక్టోటర్ 10న బ్రిటీష్ ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన కోసం జీవోనెం-3704 PW విడుదల చేసింది.
• రకరకాల ప్రతిపాదనలు, పరిశీలనల అనంతరం 340 టీఎంసీల నుంచి 836 టీఎంసీలకు పెంచారు. ఆ స్థాయిలో నీటిని సేకరించాలని ఆలోచించారు. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలు పరిశీలించి, చివరకు ఇప్పుడు నిర్మించిన ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 1947-48లో పోలవరం ప్రాజెక్ట్ విలువ రూ.129 కోట్లుగా అంచనావేసి, రామపాద సాగర్ గా ప్రాజెక్టుకి నామకరణం చేశారు.
• ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 194 టీంసీలు. మరో 200 టీఎంసీలు అదనంగా వినియోగించుకునే అవకాశముంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 28.50 లక్షల జనాభాకు తాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి. వాటర్ టూరిజం అభివృద్ధితో పాటు పరిశ్రమలకు నీరు అందించవచ్చు.