container charge: జొమాటో.. ఇదేం బాదుడురా నాయనా..?: ఓ మహిళ ఆవేదన
- ఫుడ్ ఐటమ్ ఖరీదుకు సమానంగా కంటెయినర్ చార్జీ
- రూ.180 ఐటమ్ కి రూ.60 చార్జీ బాదుడు
- ఆవేదనతో ట్విట్టర్ పై పోస్ట్ పెట్టిన మహిళ
జొమాటో, స్విగ్గీ.. ఉన్న చోట నుంచే కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకునేందుకు అవకాశం కల్పిస్తున్న వేదికలు. కానీ, ఒక్కోసారి చార్జీలు మరీ ఎక్కువ పడుతున్నాయని అప్పుడప్పుడు కొందరు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఎత్తి చూపుతూ ఉంటారు. తాజాగా ఓ మహిళ జొమాటోలో చేసిన ఓ ఆర్డర్ లో కంటెయినర్ పేరుతో రూ.60 చార్జీ విధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేయగా, అందులో తమ పాత్ర లేదంటూ జొమాటో బదులిచ్చింది.
అహ్మదాబాద్ కు చెందిన మహిళ ఖుష్బూ టక్కర్ జొమాటోపై ‘దూది తెప్లా’ కోసం ఆర్డర్ చేసింది. ఒక్కోటీ రూ.60 చొప్పున మూడింటి ధర రూ.180. బిల్లులో దీనికి అదనంగా కంటెయినర్ చార్జీ అంటూ రూ.60 వడ్డించారు. సీజీఎస్ టీ, ఎస్ జీఎస్ టీ 2.5 శాతం చొప్పున రూ.9 రూపాయిలు విధించారు. మహిళ ఆర్డర్ చేసిన ఫుడ్ ను ప్లాస్టిక్ కంటెయినర్ లో ప్యాక్ చేసి రెస్టారెంట్ పంపించింది. దీంతో కంటెయినర్ చార్జీ అమలు చేసింది. ఇది చూసిన ఆమెకు కోపం వచ్చేసింది. ట్విట్టర్ పై ఓ పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని పది మందితో పంచుకుంది.
‘‘నేను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ చార్జీకి సమానంగా కంటెయినర్ చార్జీ ఉంది’’ అని ఖుష్బూ టక్కర్ ప్రస్తావించింది. ఇది ఎంత మాత్రం పారదర్శకంగా లేదంటూ, కంటెయినర్ ను ఉచితంగా అందించాల్సిన బాధ్యత రెస్టారెంట్ పై లేదా? అని ప్రశ్నించింది. దీనికి జొమాటో రిప్లయ్ ఇస్తూ.. ‘‘హాయ్ ఖష్బూ, పన్నులు అనేవి దేశవ్యాప్తంగా ఒక్కటే. ఆర్డర్ చేసిన ఫుడ్ ఆధారంగా 5-18 శాతం మధ్య ఉంటాయి. ప్యాకేజింగ్ చార్జీలు అనేవి మా రెస్టారెంట్ భాగస్వాములు విధించేవి. వారే ఈ విధానాన్ని అమలు చేస్తుంటారు’’ అని బదులు ఇచ్చి మౌనంగా ఉండిపోయింది.
దీనికి ఓ యూజర్ మతిపోయే రిప్లయ్ ఇచ్చాడు. ‘‘రెస్టారెంట్ కు వెళితే ఒక తెప్లా చార్జీ రూ.35-40 మించి ఉండదు. కంటెయినర్ ఒక్కటే కాదు కన్వీనియెన్స్ చార్జీ పేరుతో మీరు అదనంగా రూ.60ని జొమాటోకు చెల్లించుకున్నారు’’ అని పేర్కొనడం గమనార్హం.