Omicron: మహారాష్ట్రలో మళ్లీ పెరుగుతున్న కొత్త రకం కరోనా కేసులు
- ఈజీ.5.1 రకం వైరస్ మొదటిసారిగా మే నెలలో గుర్తింపు
- తాజాగా పెరుగుతున్న కేసుల సంఖ్య
- గతంలో మాదిరిగా పెద్ద ప్రభావం లేదంటున్న వైద్యులు
కరోనా పేరు పెద్దగా వినిపించక చాలా రోజులు గడిచిపోయింది. కరోనా వైరస్ ఇక పోయినట్టేనని ప్రజలు కూడా భావిస్తున్నారు. కానీ, ఉన్నట్టుండి మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. కరోనా మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలైంది.
ఒమిక్రాన్ ఈజీ.5.1 రకం వైరస్ కేసులు ఇప్పుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దేశంలో ఈ తరహా వేరియంట్ ను గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ వేరియంట్ ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోర్డినేటర్ డాక్టర్ రాజేష్ కార్యకర్తే తెలిపారు. బీజే మెడికల్ కళాశాలలో ఆయన సీనియర్ సైంటిస్ట్ గానూ పనిచేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందని ఎక్స్ బీబీ.1.16, ఎక్స్ బీబీ.2.3 వేరియంట్ల మాదిరిగా దీని ప్రభావం లేదని వెల్లడించారు. అయినా కానీ రాష్ట్రంలో ఇటీవల ఈ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలించినప్పుడు.. జులై చివరికి 70 కేసులుగా ఉంటే, ఆగస్ట్ 6 నాటికి 115కు పెరిగాయి. ఈ నెల 7వ తేదీ నాటికి 109 కేసులుగా ఉన్నాయి. నిజానికి ఈజీ.5.1 రకం కేసులు వేగంగా పెరుగుతుండడం పట్ల ఇటీవలే బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా ముంబైలో 43 కేసులు, పూణెలో 34 కేసులు, థానేలో 25 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి.