Indian cough syrup: ఇరాక్ లోనూ భారత కంపెనీ నకిలీ దగ్గు మందుల గుర్తింపు
- హానికర స్థాయిలో డై ఎథిలేన్, ఎథిలేన్ గ్లైకాల్
- ప్రకటన విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- దీన్ని తయారు చేసింది ఫోర్ట్స్ ఇండియా ల్యాబొరేటరీస్
భారత కంపెనీ తయారీ నాసిరకం దగ్గు మందు సేవించి గతేడాది గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇరాక్ లోనూ భారత కంపెనీ తయారు చేసిన నకిలీ దగ్గు మందును గుర్తించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ హెచ్చరిక విడుదల చేసింది.
ఈ దగ్గు మందు కలుషితం అయిందని, సేవించడానికి సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సంబంధిత దగ్గు మందు బ్యాచ్ నంబర్ ను సైతం విడుదల చేసింది. ఈ సిరప్ పేరు ‘కోల్డ్ అవుట్’. దీన్ని భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఫోర్ట్స్ ఇండియా ల్యాబొరేటరీస్ తయారు చేసింది. డాబిలైఫ్ ఫార్మా కోసం ఈ దగ్గుమందును తయారు చేసి ఇచ్చింది.
హానికారక డైఎథిలేన్, ఎథిలేన్ గ్లైకాల్ ఈ దగ్గు మందులో అనుమతించే దాని కంటే ఎంతో ఎక్కువ పరిమాణంలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రెండూ 0.10 శాతం లోపే ఉండాలని, కానీ కోల్డ్ అవుట్ సిరప్ లో 0.25 శాతం, 0.21 శాతం చొప్పున ఉన్నట్టు పేర్కొంది. ఈ ఆరోపణలపై ఫార్మా కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ వరుస ఘటనలు భారత ఫార్మా పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామెరాన్ లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు మందు తయారీని నిలిపివేయాలంటూ, గత నెలలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రీమన్ ల్యాబ్స్ ను ఆదేశించడం గమనార్హం.