Male infertility: పురుషుల్లో సంతాన భాగ్యానికి అవరోధాలు ఇవి..!
- జీవనశైలి, ఆహార అలవాట్ల ప్రభావం కీలకం
- రోజువారీ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం
- ఒత్తిడి, అధిక, తక్కువ బరువు లేకుండా చూసుకోవాలి
కొత్తగా పెళ్లయిన వారు, పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్న వారు తమ లైంగిక ఆరోగ్యం గురించి ముందుగా సమగ్రంగా తెలుసుకోవడం మంచిది. గతంతో పోలిస్తే సంతాన సాఫల్యత సామర్థ్యం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కొందరికి పెళ్లయిన వెంటనే సంతానం కలుగుతుంటే, కొందరు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. ముఖ్యంగా నేటి జీవనశైలి, ఆహారం అలవాట్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. పురుషుల్లో సంతాన భాగ్యానికి అడ్డు పడుతున్న అంశాల గురించి ఇక్కడ చూద్దాం.
ఆరోగ్యకరమైన జీవనశైలి
పురుషుల్లో వీర్యకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నప్పుడే సంతాన సాఫల్యత అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వీర్యం నాణ్యతపై జీవనశైలి ప్రభావం ఉంటుంది. అందుకని పోషకాహారం, సమతులాహారం, తగినంత నీరు తీసుకోవాలి. మద్యపానం, పొగతాగడం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి
తీవ్ర ఒత్తిడి కూడా సంతానానికి అడ్డుగోడగా వ్యవహరిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, వీర్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వ్యాయామం, మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడిని తొలగించుకోవచ్చు. మనసుకు ఉల్లాసాన్నిచ్చే వ్యాపకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
బరువు
శరీర బరువు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అధిక బరువు, అదే సమయంలో తక్కువ బరువు ఉండకూడదు. ఈ విషయంలో న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.
కాలుష్యం
పర్యావరణ కాలుష్య ప్రభావం కూడా సంతాన సాఫల్యతపై ఉంటుంది. అధిక వేడికి ఎక్కువ సమయం పాటు గురికాకుండా చూసుకోవాలి. పురుగు మందులు, మెటల్స్ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి. గాలి కాలుష్యం ప్రభావం తగ్గించుకునేందుకు అధిక రక్షణనిచ్చే ఫేస్ మాస్క్ వాడాలి.
వ్యాయామాలు
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. ఇది కూడా సంతాన సాఫల్యతను మెరుగుపరుస్తుంది. దీనికితోడు వైద్యుల దగ్గరకు వెళ్లి ఏవైనా అవరోధాలు ఉన్నాయేమో నిర్ధారించుకోవాలి.