Electricity Employees: ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు

AP Electricity employees ready to indefinite strike from August 10

  • విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో జేఏసీ చర్చలు విఫలం
  • రేపు పెన్ డౌన్, సెల్ ఫోన్ డౌన్
  • శాంతియుత నిరసనల కొనసాగింపు
  • విజయవాడలో విద్యుత్ సౌధ వద్ద భద్రత కట్టుదిట్టం
  • నగరంలో 144 సెక్షన్ అమలు
  • ఎస్మా ప్రయోగానికి వెనుకాడేది లేదన్న ప్రభుత్వం

ఇటీవల రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఈ నెల 10 నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయాలని ప్రకటించడం తెలిసిందే. జులై నెలాఖరు నుంచే విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతున్న విద్యుత్ ఉద్యోగులు... తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. 

రేపు (ఆగస్టు 9) పెన్ డౌన్, మొబైల్ ఫోన్ డౌన్ చేయనున్నారు. బుధవారం సాయంత్రం లోపు అధికారిక సిమ్ లు ఇచ్చివేయనున్నారు. అత్యవసర సేవలకు మినహాయించి, మిగతా విధులకు దూరం కానున్నారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో, విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయవాడలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

వాస్తవానికి ఇవాళ (ఆగస్టు 8) విద్యుత్ జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చినా... ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గింది. మహాధర్నా విరమించుకుంటున్నట్టు జేఏసీ తెలిపింది. శాంతియుతంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అవసరమైతే ఎస్మా ప్రయోగించేందుకు వెనుకాడబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News