Chandrababu: అంగళ్లు అల్లర్ల కేసు: ఏ1 చంద్రబాబు, ఏ2 దేవినేని ఉమా.. 11 సెక్షన్ల కింద కేసుల నమోదు
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అల్లర్లు
- అంగళ్లులో జరిగిన అల్లర్లపై ముదివేడు పీఎస్ లో కేసుల నమోదు
- పుంగనూరు అల్లర్లలో ఇప్పటి వరకు 74 మంది అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్లులో జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై ముదివేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాలను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120 బీ, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 ఆర్/డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ వాళ్లు అల్లర్లు చేస్తే చంద్రబాబుపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కాగా, పుంగనూరులో ఇప్పటి వరకు 74 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అమర్ నాథ్ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేశారు.