West Bengal: రిటైర్మెంట్‌పై యూ టర్న్ తీసుకున్న బెంగాల్ క్రీడా శాఖ మంత్రి
- వారం కిందట అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన మనోజ్ తివారి
- మరో ఏడాది ఆడాలని తాజాగా నిర్ణయం
- బెంగాల్‌కు రంజీ ట్రోఫీ అందించేందుకు చివరి ప్రయత్నం చేస్తానని వెల్లడి
భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ యూటర్న్ తీసుకున్నారు. క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో మనోజ్ తివారీ నిన్న సమావేశం అయ్యారు. స్నేహశిష్ సూచన మేరకు తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మనసు మార్చుకున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 3న అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ తివారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగాల్ జట్టుకు రంజీ ట్రోఫీని అందించేందుకు మరో ఏడాది పాటు ఆడాలని నిర్ణయించుకున్నారు.
ఇది వరకు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బెంగాల్ గత మూడు సీజన్లలో రెండుసార్లు రంజీ ఫైనల్‌కు చేరుకుంది. కానీ, మూడో ట్రోఫీ మాత్రం నెగ్గలేకపోయింది. ‘బెంగాల్ క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. ఆటగాడిగా లేదా కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ నెగ్గేందుకు మరోసారి ప్రయత్నించాలని అనుకుంటున్నా. అందుకే రిటైర్మెంట్ నుంచి వెనక్కి వస్తున్నా. వచ్చే సంవత్సరం ఇకపై యూ-టర్న్ ఉండదు. బెంగాల్ క్రికెట్‌కు మరో ఏడాది సమయం ఇవ్వాలనుకుంటున్నాను’ అని 37 ఏళ్ల తివారీ చెప్పారు.