Facebook love: ఫేస్ బుక్ లవ్: అంజూ వీసా గడువు పొడిగించిన పాక్ ప్రభుత్వం
- ఈ నెల 20 తో ముగియనున్న వీసా గడువు
- తొలుత రెండు నెలలు ఆపై ఏడాది పాటు పొడిగింపు
- మతం మారి నస్రుల్లాను పెళ్లాడిన రాజస్థానీ మహిళ
ఫేస్ బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థానీ మహిళ అంజూ.. మతం మారి ప్రియుడిని పెళ్లాడిన విషయం తెలిసిందే. విజిటర్ వీసాతో అంజూ పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. వీసా గడువు ఈ నెల 20న ముగియనుండగా.. తాజాగా పాక్ ప్రభుత్వం ఈ గడువును ఏడాది పాటు పొడిగించింది. తొలుత రెండు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించినా తర్వాత ఏడాది పాటు దేశంలో ఉండేలా వీసా గడువును పొడిగించింది.
రాజస్థాన్ కు చెందిన అంజూకు భారత్ లో భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడు నస్రుల్లా కోసం ఏకంగా దేశం దాటి వెళ్లింది. టూరిస్టు వీసా సంపాదించి వాఘా బార్డర్ గుండా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడిని కలుసుకోవడంతో పాటు పాక్ ను చూడాలని వచ్చినట్లు చెప్పిన అంజూ.. రెండు రోజుల్లోనే మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుని నస్రుల్లాను పెళ్లాడింది. మరోవైపు, అంజూ మొదటి భర్త జైపూర్ లో పోలీస్ కేస్ పెట్టాడు. తనకు విడాకులివ్వకుండా అంజూ చేసుకున్న రెండో పెళ్లి చెల్లదని, ఆమెతో పాటు నస్రుల్లాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఫాతిమా (అంజూ), నస్రుల్లాలపై జైపూర్ లో పోలీస్ కేస్ నమోదైంది.