Bharat Mata: తమిళనాడులో బీజేపీ కార్యాలయం నుంచి భరతమాత విగ్రహాన్ని తొలగించిన పోలీసులు
- విరుద్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన
- అనుమతి లేదంటూ ఎత్తుకెళ్లిపోయిన పోలీసులు
- పార్టీ స్థలంలో విగ్రహం ఏర్పాటు హక్కు లేదా అని ప్రశ్నించిన బీజేపీ
తమిళనాడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీజేపీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. విరుద్ నగర్ జిల్లా కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ‘ఎన్ మాన్ ఎన్ మక్కల్’ పాదయాత్ర విరుద్ నగర్ జిల్లాలో ఆగస్ట్ 9 నుంచి 11 మధ్య జరగనుంది. అన్నామలై పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడానికి ముందు పోలీసులు ఈ చర్యకు ఒడిగట్టారు.
అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారంటూ విరుద్ నగర్ బీజేపీ కార్యాలయం నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విగ్రహం ఏర్పాటు చేసినట్టు పోలీసుల వాదనగా ఉంది. ఈ ఘటనను బీజీపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఖండించారు. ‘‘తమిళనాడులో అవినీతి డీఎంకే ప్రభుత్వ పాలనలో పార్టీకి చెందిన స్థలంలోనూ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కూడా లేదు. మా పాదయాత్ర డీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపుతుందన్న భయంతో జిల్లాకు చెందిన మంత్రుల్లో భయం నెలకొంది’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు.