Ravichandran Ashwin: వాటర్ బోయ్ లా పనిచేయాల్సి వచ్చింది: అశ్విన్ ఆవేదన
- కెరీర్ ఆరంభంలో తాను చేసిన పనిని చెప్పిన బౌలర్
- మొదట్లో అవకాశాలు వచ్చేవి కావంటూ ఆవేదన
- ఆట గురించి నేర్చుకోవడానికి అవకాశం చిక్కినట్టు వెల్లడి
రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్. స్పిన్ మాంత్రికుడైన అశ్విన్ తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతో వేచి చూడాల్సి వచ్చేది. టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుతూ అశ్విన్ తన కెరీర్ ఆరంభం నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఆరంభంలో తనకు తగిన అవకాశాలు వచ్చేవి కాదని చెప్పాడు. అయితే, తన కెరీర్ ను తీర్చిదిద్దడంలో మాత్రం నాటి రోజులు ఎంతో కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నాడు.
‘‘2009లో నేను జట్టులో చేరినప్పుడు ఆరంభ సంవత్సరాల్లో వాటర్ బోయ్ గా (మైదానంలోని ఆటగాళ్లకు కావాల్సినప్పుడు నీరు అందించడం) పనిచేశాను. 11 మంది ఆటగాళ్లతో కూడిన తుది జట్టులో నాకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కాకపోతే టీమిండియా బృందంతో ఉండేవాడిని. ఒక ఆటగాడిగా నేర్చుకునేందుకు నాటి రోజులు ఎంతో ముఖ్యమైనవి’’ అని అశ్విన్ వివరించాడు.
ఇషాన్ కిషన్ కు సైతం తన మాదిరే సారూప్యతలు ఉన్నట్టు అశ్విన్ చెప్పాడు. ‘‘ఇషాన్ కిషన్ కూడా ఎన్నో ఏళ్లు బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ పై వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు అతడు గొప్పగా ఆడాడు. అతడు స్క్వాడ్ లో ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు’’ అని అశ్విన్ తెలిపాడు. అశ్విన్ బౌలింగ్ పరంగానే కాకుండా, బ్యాటింగ్ లోనూ సత్తా చాటుతూ మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించడం తెలిసిందే.