Smriti Irani: ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనుకుంటున్నారా?: రాహుల్ గాంధీపై ఊగిపోయిన స్మృతి ఇరానీ
- మీరు ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపమని రాహుల్‌పై నిప్పులు
- భారత్‌ను హత్య చేశారన్న రాహుల్ వ్యాఖ్యలను భారత్ క్షమించదన్న స్మృతి
- కశ్మీర్ పండిట్లపై దారుణాలు కాంగ్రెస్‌కు కనిపించలేదా? అని నిలదీత
- బెంగాల్, రాజస్థాన్‌లోని అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. మీరు ఇండియా కాదని.. అవినీతికి ప్రతిరూపమని విమర్శించారు. భరతమాతను చంపేశారని సభలో ఇప్పటి వరకు ఎవరూ అనలేదని, రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను భారతజాతి క్షమించదన్నారు. మణిపూర్ రెండుగా చీలలేదని, అది భారతదేశంలో అంతర్భాగమని నొక్కి వక్కాణించారు. భారత్‌ను హత్య చేశారని రాహుల్ మాట్లాడుతూంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయడం విడ్డూరమని విరుచుకుపడ్డారు.
భారత్ అంటే ఉత్తర భారతం మాత్రమేనని ప్రతిపక్ష కూటమి సభ్యుడు తమిళనాడులో అన్నారని, దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్‌గాంధీ దీనిపై వ్యాఖ్యానించాలన్నారు. మరో కాంగ్రెస్ నేత కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోరుతున్నారని, పార్టీ అనుమతితోనే అలా మాట్లాడారా? ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కశ్మీర్ పండిట్లపై దారుణాలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. పండిట్లను ఉద్ధేశించి.. పారిపోవడం, మారిపోవడం, చనిపోవడం.. ఈ మూడు మీ ముందు ఉన్న మార్గాలు అని ర్యాలీలు తీసినప్పుడు, వారి ఆర్తనాదాలు వినిపించలేదా? అని ప్రశ్నించారు.
బెంగాల్‌లో భర్త ఎదుటే భార్యను అత్యాచారం చేసినప్పుడు, రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు కాంగ్రెస్ ఎందుకు చూడలేకపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లోయ రక్తంతో తడిసి ముద్దయిందని, కానీ మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడికి వెళ్లిన రాహుల్ గాంధీ స్నో బాల్స్‌తో ఆడుకున్నారని గుర్తు చేశారు.