Kerala: మా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చండి: కేరళ అసెంబ్లీ తీర్మానం
- కేరళంగా మార్చాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం పినరయి విజయన్
- తీర్మానాన్ని ఆమోదించిన యూడీఎఫ్
- అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్
తమ రాష్ట్ర పేరును అధికారికంగా 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ బుధవారం కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చబడిన అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఆమోదించింది. ఇందులో ఎలాంటి సవరణలు సూచించలేదు. అనంతరం స్పీకర్ శ్యాంసీర్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు.
తీర్మానాన్ని సమర్పిస్తూ.. రాష్ట్రాన్ని మలయాళంలో 'కేరళం' అని పిలిచేవారని, ఇతర భాషల్లో ఇప్పటికీ కేరళ అంటున్నారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్యకేరళను ఏర్పాటు చేయాల్సిన అవసరం జాతీయ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి బలంగా ఉందన్నారు. రాష్ట్రం పేరును పూర్వం నుండే మలయాళంలో కేరళం అని పిలిచేవారని, కానీ ఇతర భాషల్లో కేరళ అంటున్నారన్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో తమ రాష్ట్రం పేరును కేరళ అని రాశారని, దీనిని కేరళంగా సవరించాలన్నారు.