KTR: ధర్మపురి అర్వింద్, రేవంత్‌రెడ్డిలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి
- ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతవుతుందని జోస్యం
- రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి అంటూ ఆగ్రహం
- టీపీసీసీ చీఫ్ తెలంగాణవాది కాదని వ్యాఖ్య
బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో అర్వింద్ డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారని, ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... ఇక్కడి ఎంపీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఆయన చదువుకున్నాడో లేదో తెలియదు కానీ, ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు. కేసీఆర్ వయసు వారి నాన్న వయసు ఉంటుందని, మేమూ డీఎస్‌ను అనలేమా? మాకు మాటలు రావా? మాకు చేతకాదా? కానీ పెద్ద మనుషులను గౌరవించుకోవడం హిందూ సంప్రదాయమని, అంతేకాకుండా మనిషి నాగరికతకు చిహ్నం కూడా అన్నారు. ప్రజల ఆదరణతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన 70 ఏళ్ల కేసీఆర్‌ను పట్టుకొని నిన్నగాక మొన్న ఎంపీ అయిన వ్యక్తి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదన్న కేటీఆర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నికార్సయిన తెలంగాణవాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అన్నారు. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు కూడా కేసీఆర్ మీద ఎగబడి ఎగబడి మాట్లాడుతున్నారని, ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్నారని, కానీ పదిసార్లు అవకాశం ఇస్తే, యాభై ఏళ్లు పాలించి ఏం చేశారని నిలదీశారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. యాభై ఏళ్లు పాలించినవాడు, ఏ పని చేయడానికి చేతకానివాడు ఇప్పుడు వచ్చి కేసీఆర్‌ను తిడితే పడదామా? అన్నారు.