Ganta Srinivasa Rao: అంగళ్లు ఘటన విచారణ సీబీఐకి అప్పగించండి... కారకులు ఎవరో తెలిసిపోతుంది: గంటా

Ganta Srinivasarao demands CBI probe on Angallu incident

  • ఇటీవల అంగళ్లులో హింసాత్మక ఘటనలు
  • చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వైనం
  • చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు పెట్టడం చేతగానితనం అన్న గంటా

ఇటీవల అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగళ్లులో ఎన్ఎస్ జీ కమాండోలు, మీడియా, ప్రజలు చూస్తుండగానే చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. 

చంద్రబాబుపై జరిగిన ఘటన విచారణను సీబీఐకి అప్పగిస్తే, దాడికి కారకులు ఎవరో తెలిసిపోతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా కేసులు పెట్టడంపై గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై చేయాల్సిన దౌర్జన్యాలు, పెట్టాల్సిన కేసులు సరిపోక ఇప్పుడు చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అని ఘాటుగా విమర్శించారు. 

"అంగళ్లు ఘటనలో వైసీపీ గూండాల అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా మా నాయకుడి మీద కేసు పెట్టడం మీ అరాచక పాలనకు పరాకాష్ఠ" అని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవస్థను నిస్సహాయులుగా చేయడమే కాకుండా, వారిని కూడా అధికార పార్టీ నేరాల్లో భాగస్వాములను చేస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారని గంటా పేర్కొన్నారు.

"సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు చేపట్టిన యుద్ధభేరి, లోకేశ్ చేపట్టిన యువగళంకు లక్షలాది మంది జనం వస్తుండడంతో జగన్ వెన్నులో వణుకు మొదలై, అసహనంతో తప్పుడు కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే రాష్ట్రంలో మీ పాదయాత్రలు, ప్రచారాలు సాఫీగా చేయగలిగేవారా...? అరాచకాలు, విధ్వంసాలతో ప్రారంభమైన మీ ప్రభుత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుర్తుంచుకోండి జగన్ గారూ" అంటూ గంటా తీవ్రస్థాయిలో స్పందించారు.

  • Loading...

More Telugu News