Chandrayaan-3: ఆగస్టు 16, 17 తేదీల్లో చంద్రయాన్-3లో కీలక ఘట్టాలు

ISRO takes up maneuvers of Chandryaan 3 successfully

  • జులై 14న చంద్రయాన్-3 ప్రయోగం
  • ఇప్పటివరకు సజావుగా సాగుతున్న వైనం
  • స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను దశలవారీగా తగ్గిస్తున్న ఇస్రో
  • నేడు మూడో దశ ప్రక్రియ విజయవంతం

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సజావుగానే సాగుతోంది. ఇవాళ చంద్రుడి ఉపరితలాన్ని మరింత సమీపించేలా చంద్రయాన్-3 కక్ష్యను 174 కి.మీ × 1437 కి.మీ మేర తగ్గించారు. ఈ మేరకు నిర్వహించిన మూడో దశ సాంకేతిక ప్రక్రియ విజయవంతమైంది. 

సోమవారం నాడు చంద్రయాన్-3 పరిభ్రమించే ఎత్తును కూడా గణనీయంగా తగ్గించడం తెలిసిందే. జాబిల్లి కక్ష్యలోని ఈ స్పేస్ క్రాఫ్ట్ ను 14 వేల కి.మీ ఎత్తు నుంచి 4,313 కి.మీ ఎత్తుకు తీసుకువచ్చారు. ఆగస్టు 14న కూడా కక్ష్యను కుదించే ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఇస్రో వెల్లడించింది. 

ఇక, ఆగస్టు 16న చంద్రయాన్-3లో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. చంద్రయాన్-3 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 17న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనుంది.

 ఈ మాడ్యూల్ విడిపోయాక, ఇస్రో దానిని చంద్రుడికి అత్యంత సమీపంలోని కక్ష్యలో (30 కి.మీ × 100 కి.మీ) ప్రవేశపెట్టనుంది. చంద్రుడిపై చంద్రయాన్-3 మాడ్యూల్ దిగేది ఈ కక్ష్య నుంచే.

  • Loading...

More Telugu News