Sajjala Ramakrishna Reddy: భోళా శంకర్... ఆధారాలు చూపించి టిక్కెట్ ధర పెంచుకోవచ్చు: సజ్జల
- జగన్‌ను ప్రశంసించిన నోటనే చిరంజీవి ఎందుకు అలా మాట్లాడారో అన్న సజ్జల
- చిరంజీవి ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకుంటున్నారో తెలియడం లేదని వ్యాఖ్య
- సినిమా టిక్కెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని స్పష్టీకరణ
మెగాస్టార్ చిరంజీవి గతంలో ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసించారని, కానీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడారో తెలియదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జల పైవిధంగా స్పందించారు. సీఎం జగన్ ఏ విషయంలోను వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారని, పారదర్శకతతో జగన్ బాగా పని చేస్తున్నారని చిరంజీవి ఇదివరకు చెప్పారన్నారు. చిరంజీవి ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకుంటున్నారో తెలియడం లేదన్నారు.
ప్రత్యేక హోదా వంటి అంశాలపై చిరంజీవి దృష్టి సారించాలని సూచించడంపై స్పందిస్తూ.. ఆయన కూడా కేంద్రమంత్రిగా పని చేశారని, అన్నీ తెలుసునన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్డీయేలో ఉన్నారని, ఆయన ద్వారా రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. జగన్ కూడా రాష్ట్రం కోసం ప్రధాని మోదీని అడుగుతూనే ఉన్నారన్నారు.
భోళా శంకర్ సినిమా టిక్కెట్ ధరల పెంపును ప్రభుత్వం తిరస్కరించిన అంశంపై కూడా స్పందించారు. సినిమాలకు వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడవద్దని హితవు పలికారు. సినిమా టిక్కెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్నారు. సినిమా రంగంపై ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నారు. ఎవరైనా సరే ఆధారాలు చూపించి టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చునని చెప్పారు.
ఒకరికి అనుమతించారని, మరొకరికి అనుమతించలేదనేది ఉండదని, బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ ధర నిర్ణయం ఉంటుందన్నారు. ఇంతకంటే పారదర్శకంగా ఏమీ ఉండదన్నారు. ఏ సినిమా అయినా రూ.100 కోట్ల బడ్జెట్ దాటితే, అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించి టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి తీసుకోవచ్చునన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి, నిర్మాతకూ ఆదాయం వస్తుందన్నారు.