Bhola Shankar: 'భోళాశంకర్' చిత్రం యూనిట్ 11 డాక్యుమెంట్లు ఇవ్వలేదు: ఏపీ ప్రభుత్వం
- రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న 'భోళాశంకర్'
- టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరిన చిత్ర యూనిట్
- 11 డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్మాతలకు సూచించిన ప్రభుత్వం
ఇరు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' సినిమా మేనియా మొదలయింది. ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. మరోవైపు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వాలని చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి సమాధానంగా... రెమ్యునరేషన్ కాకుండా, సినిమాకు రూ. 101 కోట్లు ఖర్చు చేశామని నిర్మాతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ... అనుమతికి కావాల్సిన 11 డాక్యుమెంట్లను నిర్మాతలు ఇవ్వలేదని చెప్పింది. చిత్ర నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని తెలిపింది. రేట్ల పెంపుకు సంబంధించి నెల ముందగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. చిత్ర నిర్మాతలు గత ఏడాది ఐటీ ప్రూఫ్స్, జీఎస్టీ వివరాలు ఇవ్వలేదని తెలిపింది. మరోవైపు టికెట్ల ధరలు పెంచుకోవాలంటూ 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగినట్టు ఆధారాలను ఇవ్వాలనే నిబంధనను కూడా ప్రభుత్వం పెట్టింది. పెండింగ్ డాక్యుమెంట్లను ఇవ్వాలని నిర్మాతలకు సూచించింది. అయితే చిత్ర నిర్మాతలు ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.