Italy: పీతల నిర్మూలనకు రూ.26 కోట్లు ఖర్చు పెట్టనున్న ఇటలీ.. ఎందుకంటే..!
- విపరీతంగా పెరిగిపోతున్న నీలిరంగు పీతలు
- తీవ్రంగా నష్టపోతున్న ఆక్వాకల్చర్ రైతులు
- మొలస్కా జాతి నత్తలను తినేస్తున్న పీతలు
దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నీలిరంగు పీతలను నిర్మూలించేందుకు ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పీతలను నాశనం చేసేందుకు ఏకంగా రూ.26 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆక్వాకల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పశ్చిమ అట్లాంటిక్ కి చెందిన ఈ నీలిరంగు పీతల వల్ల సముద్ర జాతికి చెందిన మొక్కలు, తీరప్రాంతంలోని జలచరాలు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తొలినాళ్లలో అక్కడక్కడా నీలిరంగు పీతలను గుర్తించిన ఇటలీ వాసులు.. వాటి సంఖ్య వేగంగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటలీ వాసులు ఎంతో ఇష్టంగా తినే మొలస్కా జాతికి చెందిన నత్తలను ఈ పీతలు తినేస్తున్నాయట. దీంతో పో రివర్ వ్యాలీ డెల్టాలోని అక్వా ఫార్మ్ లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. డెల్టాలోని నత్తలను దాదాపుగా 90 శాతం కాజేశాయని జీవశాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ప్రభుత్వం పో రివర్ వ్యాలీకి శాస్త్రవేత్తల బృందాన్ని పంపి అధ్యయనం చేయించింది.
శాస్త్రవేత్తల బృందంతో పాటు ఇటలీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రాన్సిస్కో లోలో బ్రిగిడా కూడా పో రివర్ వ్యాలీ డెల్టాలో పర్యటించారు. పీతల వల్ల ఆక్వా రైతులకు వాటిల్లిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం పీతల నిర్మూలనకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పీతలను వేటాడి అంతం చేయడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రాన్సిస్కో తెలిపారు.