Mallikarjun Kharge: ప్రధాని మోదీ ఏమైనా దేవుడా? ఆయన వస్తే ఏమవుతుంది?: మల్లికార్జున ఖర్గే
- పార్లమెంటుకు మోదీ గైర్హాజరుపై ఖర్గే ఆగ్రహం
- మోదీ తనను తాను దైవంగా భావిస్తున్నారా? అని నిలదీత
- ఖర్గే వ్యాఖ్యలను నిరసించిన ఎన్డీయే సభ్యులు
అవిశ్వాస తీర్మానంలో భాగంగా మణిపూర్ హింసపై జరుగుతున్న చర్చ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు కావడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను వ్యక్తిగతంగా ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడాన్ని బట్టి ప్రధాని తనను తాను దైవంగా భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. 176వ నిబంధన కింద మణిపూర్ అంశంపై చర్చ జరగాలన్నారు. ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్డీయే సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖర్గే ఇంకా మాట్లాడుతూ... ప్రధాని రాజ్యసభకు వస్తే ఏమవుతుంది? ఆయన ఏమైనా దేవుడా? పరమాత్ముడేమీ కాదు కదా.. అన్నారు.
అంతకుముందు ఆయన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ లోక్ సభలో భారత ప్రజలవాణిని వినిపించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రధాని మోదీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్నారు. ఈ తీర్మానంపై ఆగస్ట్ 8న చర్చ ప్రారంభం కాగా, చివరిరోజైన నేడు పలువురు ఎంపీలు మాట్లాడారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది.