Tomato: భారీగా తగ్గిన టమాట ధరలు.. మదనపల్లె మార్కెట్‌లో రేటు ఇదే!
- గత నెలలో రికార్డుల మోత మోగించిన టమాటాలు
- మదనపల్లె మార్కెట్ యార్డులో భారీగా తగ్గిన ధరలు
- కిలో రూ.50 – 64 దాకా పలికిన గ్రేడ్ ‘ఏ’ టమాటాలు
రికార్డు రేట్లతో మోత మోగించిన టమాటాలు దిగివస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజులుగా మార్కెట్‌కు భారీగా పంట వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి.
బుధవారం వరకు కిలో రూ.80 నుంచి రూ.100 వరకు అత్యధికంగా పలికింది. అయితే ఈ రోజు గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ.50 నుంచి రూ.64 వరకు పలికాయి. గ్రేడ్ ‘బి’ రూ.36 నుంచి రూ.48 వరకు పలికాయి. సగటున కిలో రూ.44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు.
మదనపల్లి మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా గత నెల 30న కిలో టమాటాలు అత్యధికంగా రూ.196 పలికాయి. ఇక వినియోగదారులకు చేరేసరికి ఆ రేటు భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల రూ.250 దాకా పలికింది. ఇటీవల రూ.200 నుంచి రూ.100కు పడిపోగా.. ఇప్పుడు మరింత తగ్గాయి. రేట్లు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.