karumuri nageswara rao: పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్?: మంత్రి కారుమూరి
- మనస్థాయి ఏమిటి? మన బ్రతుకేంటి? ఆలోచించాలని హితవు
- సినిమాలను సినిమాలుగా, రాజకీయాలను రాజకీయంగా చూడాలని సూచన
- పుంగనూరు ఘటనపై చంద్రబాబుపై ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే పంచలూడదీస్తా... తాటతీస్తా అంటున్నాడని, ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని మంత్రి కారుమూరి నాగేశ్వరరవు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మనస్థాయేంటి? మన బ్రతుకేంటి? అని ఆలోచించుకోవాలని హితవు పలికారు. సినిమాలను సినిమాలుగా, రాజకీయాలను రాజకీయాలుగా చూడాలన్నారు. అంతేకానీ, సినిమాను, రాజకీయాన్ని జోడించు చూడవద్దన్నారు.
పుంగనూరు ఘటనపై మాట్లాడుతూ... పోలీసులకు చేతులెత్తి మొక్కాలన్నారు. రక్తమోడుతున్నా సంయమనం పాటించారన్నారు. చంద్రబాబు ఇంకెంతమంది ఉసురు పోసుకుంటారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లేవని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఓ ముసలి నక్క, దుర్మార్గుడు, పుంగనూరులో రౌడీలా వ్యవహరించారన్నారు. లోకేశ్ అయితే ఒక పప్పు అని, అసలు రాజకీయ నాయకుడేనా? అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారంతా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలేనని, కానీ ఆ పార్టీల కార్యకర్తలు కూడా తమను విమర్శించడం లేదన్నారు. జగన్ పాలనలో అన్ని పార్టీల వారికి, అన్ని వర్గాల వారికి పథకాలు అందుతున్నాయన్నారు. సర్వేలలో వైసీపీ మరోసారి గెలుస్తుందని తేలిందని, అందుకే వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల ఉసురు, ప్రజల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఇతరులతో కలిసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.