Narendra Modi: నో కాన్ఫిడెన్స్ మోషన్ నో బాల్‌గా మిగిలిపోయింది: ప్రధాని మోదీ
- మూడ్రోజులుగా మా వైపు నుండి ఫోర్లు, సిక్సులు, విపక్షాల ఫీల్డింగ్ అని ఎద్దేవా
- అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని విమర్శ
- 2024లో ఎన్డీయే అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందని ధీమా
- అయిదేళ్ళ సమయమిచ్చినా ప్రజల అభిమానాన్ని విపక్షాలు చూరగొనలేదని వ్యాఖ్య
అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలు మూడ్రోజులుగా ఫీల్డింగ్ చేస్తుంటే తమ వైపు నుండి ఫోర్లు, సిక్సులు పడ్డాయని, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడని, ఇలా పెట్టినందుకు మోదీ వారికి ధన్యవాదాలు చెప్పారు.
విపక్షాల అవిశ్వాసం తమకు శుభసూచకమన్నారు. 2018లోను అవిశ్వాస తీర్మానం పెట్టారని, కానీ ప్రతిపక్షాలకు వారికి ఉన్న సభ్యుల ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ అవిశ్వాసం తమపై కాదని, విపక్షాల పైనే అన్నారు. 2024లో ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, కానీ విపక్షాలకు మాత్రం అధికార దాహం పెరిగిందన్నారు. పేదల భవిష్యత్తు కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమని విమర్శించారు.
మూడురోజులుగా అవిశ్వాసంపై జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగించిందని, విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే, తమ వైపు నుండి ఫోర్లు, సిక్స్‌లు పడ్డాయన్నారు. అయిదేళ్లు సమయం ఇచ్చినా విపక్షాలు తమపై సిద్ధం కాలేదని ఎద్దేవా చేశారు. ఈ కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలమైనట్లు చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని ఆరోపించారు. కానీ వారు ప్రవేశపెట్టిన నో కాన్ఫిడెన్స్ నో బాల్ గా మిగిలిపోయిందన్నారు. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా విన్నదన్నారు. అధిర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదో తనకు అర్థం కాలేదని, బహుశా కోల్ కతా నుండి ఫోన్ వచ్చినట్లుందని చమత్కరించారు.
మా పాలన ఎలాంటి కుంభకోణాలు లేకుండా స్కామ్ ఫ్రీగా భారత్ ముందు నిలిచిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయన్నారు. తాము భారత్ ప్రతిష్ఠను విశ్వాంతరం చేశామన్నారు. కానీ విపక్షాలు భారత ప్రతిష్ఠను విదేశాల్లో మసకబార్చే ప్రయత్నం చేశాయన్నారు. మా పాలనలో దేశం ఎంతగా బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం అన్నారు. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించిందన్నారు. మా దృష్టి అంతా అభివృద్ధి పైనే అన్నారు. ప్రపంచం నలుమూలలా భారత్‌కు విస్తార అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, హెచ్ఏఎల్ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బాగుందని, హెచ్ఏఎల్ దూసుకుపోతోందన్నారు. ఎల్ఐసీ పైనా అసత్య ప్రచారం చేశారన్నారు.
విపక్షాల వెనుక రహస్య శక్తులు ఉన్నాయన్నారు. అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు. మూడు రోజులుగా విపక్షాలు డిక్షనరీని తిప్పాయని, తమను అనరాని మాటలతో ఇప్పుడు వారి ఆత్మ శాంతించి ఉంటుందన్నారు. భారత్ లో జరిగే మంచి పనులు చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.