Narendra Modi: 2028లోనూ మా ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయి: ప్రధాని మోదీ
- కాంగ్రెస్‌కు విజన్, నిజాయతీ, ఆర్థిక విధానం లేవన్న ప్రధాని
- భారత ప్రజలు, సైన్యం, వ్యాక్సిన్‌పై నమ్మకం లేదని ఆగ్రహం
- బెంగాల్, తమిళనాడు, ఒడిశా సహా వివిధ రాష్ట్రాలు కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పాయని ఎద్దేవా
- విపక్షాలు NDAకు రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని వ్యాఖ్య
- ఇండియా కూటమిలో అందరికీ ప్రధాని కావాలనే కోరికంటూ సెటైర్
కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయ ఆర్థిక విధానం తెలియదని, ఆ పార్టీకి ఓ విజన్ లేదని, నిజాయతీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిందన్నారు. 2028లోను తమపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారత వ్యాక్సిన్‌పై, భారత ప్రజలపై, భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం లేవన్నారు. విపక్షాలకు పాకిస్థాన్‌పై ప్రేమ కనిపిస్తోందని, ఆ దేశం చెప్పిందే నమ్ముతోందన్నారు. అందుకే పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటే కాంగ్రెస్ సైన్యాన్ని నమ్మలేదన్నారు. అందుకే తమిళనాడు ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పారన్నారు. అలాగే బెంగాల్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్.. ఇలా పలు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పాయన్నారు. క్రమంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. మేకిన్ ఇండియా అంటే కూడా ఎగతాళి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహంకారంతో కళ్లు మూసుకుపోయాయన్నారు.
విపక్షాలు ఇండియాను.. I.N.D.I.A. అంటూ ముక్కలు చేశాయన్నారు. విపక్షాలు NDAకు రెండు Iలు చేర్చి I.N.D.I.A.గా మార్చాయని, మొదటి I.. 26 పార్టీల అహంకారానికి, రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతి పథకం వెనుక కాంగ్రెస్ ఓ కుటుంబం పేరే చేర్చిందన్నారు. విపక్షాలలో ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు. కానీ అక్కడ స్కీంలకు బదులు స్కామ్‌లు ఉంటాయన్నారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి గాంధీ పేరును వినియోగించుకుందని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అవినీతి కూటమి అన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన అంటే ఇష్టమన్నారు.