Chandrababu: ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా?: వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్
- వంశధార ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు
- ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్
- పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా విమర్శనాస్త్రాలు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు.
ఇక, ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 9 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా శ్రీకాకుళం అని చంద్రబాబు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాతో పోల్చితే, అందులో సగం వర్షపాతమే అనంతపురం జిల్లాలో నమోదవుతుందని వివరించారు.
"తారకరామ తీర్థ సాగర్ రిజర్వాయర్ కు టీడీపీ ప్రభుత్వం రూ.104 కోట్లు ఖర్చు పెట్టింది... ఇదే ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.57 కోట్లు! తారకరామ తీర్థ సాగర్ పనులు 41 శాతం పూర్తయ్యాయి. మద్దువలస రిజర్వాయర్ కు వైసీపీ సర్కారు రూ.1.3 కోట్లు ఖర్చు పెట్టింది. టీడీపీ హయాంలో తోటపల్లి బ్యారేజికి రూ.237 కోట్లు ఖర్చు చేశాం. తోటపల్లి బ్యారేజికి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.12 కోట్లే.
గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ రూ.49.75 కోట్లు ఖర్చు చేసింది. ఇదే కెనాల్ కు వైసీపీ సర్కారు రూ.4.71 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. నాగావళి-వంశధార నదుల అనుసంధానానికి వైసీపీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని సంబంధిత మంత్రికి సవాల్ విసురుతున్నా" అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.