Bhola Shankar: ‘భోళాశంకర్’ డాక్యుమెంట్లు అడిగినా ఇవ్వలేదు.. టికెట్ల ధర పెంపుపై ఏపీ ప్రభుత్వం
- టికెట్ల ధర పెంచాలని కోరుతూ జులై 30న నిర్మాణ సంస్థ అర్జీ
- అవసరమైన పత్రాలు ఇవ్వాలని కోరామన్న ప్రభుత్వం
- స్పందనే లేదని వివరణ
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది. ‘భోళాశంకర్’ నిర్మాణ సంస్థ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ జులై 30న ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థకు అర్జీ పంపినట్టు వివరించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. హీరో, హీరోయిన్లు, దర్శకుడి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా నిర్మాణం, తదనంతర ఖర్చులు కలిపి రూ. 100 కోట్లు దాటితే అందుకు సంబంధించిన అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, సెన్సార్ పూర్తయిన తర్వాత సినిమా నిడివిలో 20 శాతం ఏపీలో చిత్రీకరించినట్టు ధ్రువీకరించే పత్రాలు వంటివాటిని అందజేయాలని ఆగస్టు 2న లేఖ ద్వారా తెలియజేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించి ఆయా నిర్మాణ సంస్థలు పత్రాలన్నీ సమర్పించడం వల్లే టికెట్ల ధర పెంపు సౌలభ్యాన్నిపెంచినట్టు వివరించింది.