apsrtc: చెన్నైలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో 47 మంది సురక్షితం
- మంటల్లో పూర్తిగా కాలిపోయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు
- నిన్న రాత్రి చెన్నైలోని మాధవరం నుంచి ఆత్మకూరుకు వస్తుండగా ఘటన
- ఇంజన్ లో పొగలు గుర్తించి డ్రైవర్ బస్సును ఆపడంతో తప్పిన పెను ముప్పు
చెన్నైలోని మాధవరం నుంచి ఆత్మకూరుకు వస్తున్న ఓ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఈ బస్సు చెన్నైలోని రెడ్ హిల్స్ సమీపంలో కాలిపోయింది. నిన్న రాత్రి 9.30 గంటలకు చెన్నైలోని మాధవరం నుంచి బయల్దేరింది. రెడ్ హిల్స్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు కూడా రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును ఆపివేశాడు. దాంతో, ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందికి దిగి బస్సుకు దూరంగా పరుగులు పెట్టారు. దాంతో, పెను ప్రమాదం తప్పింది. వాళ్లు చూస్తుండగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.