Nuego: హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒక్క రూపాయే చార్జి.. ఎందుకు? ఎప్పుడో తెలుసా?
- పర్యావరణహిత ప్రయాణాలపై అవగాహన కోసం ‘న్యూగో’ సంస్థ ఆఫర్
- ఆగస్టు 15న ప్రయాణించే అవకాశం
- దేశవ్యాప్తంగా తమ సేవలు అందుబాటులో ఉన్న ప్రతిచోటా ఆఫర్ వర్తిస్తుందన్న సంస్థ
అవును! మీరు విన్నది నిజమే. రూపాయి మాత్రమే చెల్లించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటును ఇంటర్-సిటీ ఎలక్ట్రిక్ సేవలు అందించే ‘న్యూగో’ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న ఆ సంస్థ బస్సులు ప్రయాణించే మార్గాల్లో ఎక్కడినుంచి ఎక్కడైనా రూపాయితో ప్రయాణించవచ్చంటూ బంపరాఫర్ ప్రకటించింది.
ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందేందుకు ఇప్పటికే బుకింగ్స్ మొదలైనట్టు గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈవో దేవేంద్ర తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపారు.
ఇండోర్-భోపాల్, ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నై-పుదుచ్చేరి మార్గాల్లో సేవలు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. రూపాయి ఆఫర్ దేశమంతా వర్తిస్తుందని పేర్కొన్న ఆయన బుకింగ్స్ కోసం న్యూగో వెబ్‌సైట్ https://nuego.in/bookingతోపాటు తమ సంస్థ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.