Nagaland Minister: నేచురల్ వాష్ బేసిన్ చూశారా..? ఇదిగో..!
- వెదురుతో చేసిన వాష్ బేసిన్
- నాగాలాండ్ గ్రామాల్లోని ఇళ్లల్లో ఇది సాధారణం
- వీడియోని పంచుకున్న నాగాలాండ్ మంత్రి తెంజెన్
నేటి రోజుల్లో నిర్మించే ప్రతి ఇంట్లోనూ వాష్ బేసిన్ ఉంటోంది. సాధారణంగా సిరామిక్ లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేసిన వాష్ బేసిన్ లను ఉపయోగిస్తుంటారు. గ్రానైట్ క్వార్ట్జ్ తో చేసినవీ ఉన్నాయి. కానీ, ప్రకృతి అనుకూల వాష్ బేసిన్ ను ఎప్పుడైనా చూశారా..? నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్నా షేర్ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. నాగాలాండ్ గిరిజన వ్యవహారాలు, ఉన్నత విద్యా శాఖ మంత్రి అయిన తెంజెన్, ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, తమ ప్రాంత సంప్రదాయాలు, సంస్కృతులను పరిచేయం చేస్తుంటారు.
ఈ విడత నాగాలాండ్ మంత్రి వెదురుతో చేసిన టాప్ కమ్ వాష్ బేసిన్ వీడియోని పరిచయం చేశారు. మీరు ఇలాంటిది ఎక్కడైనా చూశారా? అంటూ ఆయన నెటిజన్లకు ప్రశ్న సంధించారు. నాగాలాండ్ కు వెళితే చాలా గ్రామాల్లో ఇవి కనిపిస్తాయి. అక్కడ వెదురు బొంగులనే పైపులుగా ఉపయోగిస్తుంటారు. కొండల పై నుంచి పారే నీరు అక్కడి వారికి ఆధారం. వెదురు బొంగుకు మధ్యలో తొర్ర పెట్టి, దాన్ని నీటితో నింపుతారు. పక్కవైపున ట్యాప్ మాదిరిగా చిన్న చిల్లులు పెట్టి చిన్న స్టిక్ తో వాటిని మూసివేస్తారు. చేతులు కడుక్కోవాల్సి వచ్చినప్పుడల్లా ఆ పుల్ల బయటకు లాగడం, వాడుకున్న తర్వాత దాంతో తిరిగి మూసేయడం చేస్తుంటారు. వెదురుతో ఇళ్ల నిర్మాణం, సోఫా, గృహ వినియోగ వస్తువులు సహా ఎన్నింటినో తయారు చేస్తుంటారని తెలిసిందే. ప్రకృతి అనుకూలంగా ఏది చేసినా అది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం.