Narayana Murthy: భారతదేశ జనాభాపై ఇన్ఫోసిస్ నారాయమూర్తి ఆందోళన!
- దేశంలో జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్న నారాయణమూర్తి
- జనాభా పెరుగుదల రేటును తగ్గించడం అత్యంత అవసరమని వ్యాఖ్య
- నియంత్రణపై కొన్ని చోట్ల శ్రద్ధ వహించడం లేదని ఆందోళన
భారతదేశంలో పెరుగుతున్న జనాభాపై ఇన్ఫోసిస్ నారాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. జనాభా పెరుగుదల రేటును తగ్గించడం అత్యంత అవసరమని చెప్పారు. కొన్ని ప్రాంతాలు జనాభా నియంత్రణలో మంచి పురోగతి సాధించినా.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ అంశంపై శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నారాయణమూర్తి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయి. అవి భావ ప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాలపై స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరిక నుంచి స్వేచ్ఛ” అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తన అభిప్రాయాన్ని బాధ్యతగా, మర్యాదపూర్వకంగా, నిర్భయంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. అలాగే మెరుగైన జీవితాన్ని కోరుకునే స్వేచ్ఛ కూడా ఉంటుందని అన్నారు. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను పాటించే స్వేచ్ఛను కలిగి ఉండటం, ఇతరులపై ఆ విశ్వాసాలను రుద్దకుండా ఉండే వాతావరణంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.