btech ravi: జగన్కు ఇడుపులపాయలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదు: బీటెక్ రవి
- జగన్ సొంత ఎస్టేట్లో టీడీపీ మద్దతుదారు నామినేషన్ వేస్తే వైసీపీ భయపడుతోందన్న రవి
- వేంపల్లి ఎంపీడీవో తమ అభ్యర్థికి ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని ఆరోపణ
- సర్పంచ్ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అధికారులు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే సర్పంచ్ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అడ్డదారులు వెతుకుతున్నారని పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. జగన్ సొంత ఎస్టేట్ ఇడుపులపాయ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుదారులు నామినేషన్ దాఖలు చేస్తే, వైసీపీ కేడర్ భయపడుతోందన్నారు. వేంపల్లి ఎంపీడీవో మల్లికార్జున రెడ్డి తమ అభ్యర్థికి ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీవో, స్థానిక సిబ్బందిపై కడప జెడ్పీ సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. తమ మద్దతుదారులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ... సర్పంచ్ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక తమ అభ్యర్థికి ఇంటి పన్ను చెల్లింపు, కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వవలసిన అధికారులు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. తమ అభ్యర్థి నామినేషన్ను పరిశీలనలోనే తిరస్కరించాలని చూస్తున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఇడుపులపాయ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు పోటీ చేస్తే, గెలుస్తారనే భయంతోనే నామినేషన్ను తిరస్కరించడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు.