manipur: మణిపూర్ మండుతుంటే మోదీ 2 గంటలు టైమ్‌పాస్ చేశారు: రాహుల్ గాంధీ
- హింస జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని ప్రశ్న
- 2 గంటలకు పైగా మాట్లాడి రెండు నిమిషాలు మణిపూర్ గురించి మాట్లాడలేదని విమర్శ
- నవ్వుతూ కనిపించిన మోదీకి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీత
- సైన్యానికి అవకాశమిస్తే రెండు గంటల్లో మణిపూర్‌ను చక్కదిద్దుతుందని వ్యాఖ్య
మణిపూర్‌లో హింస జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దేశంలో ఇంత హింస జరుగుతుంటే లోక్ సభలో ప్రధాని మోదీ రెండు గంటలు టైమ్ పాస్ చేశారని ఆరోపించారు. అలాంటి వ్యవహార శైలి ప్రధానికి సరికాదన్నారు. భరతమాతను హత్య చేశారని తాను ఊరికే అనలేదని, మణిపూర్‌ను, భారత్‌ను బీజేపీ హత్య చేసింది అనేదే తన ఉద్దేశ్యం అన్నారు. మణిపూర్‌ను హత్య చేశారని, రెండుగా చీల్చారని ఆరోపించారు. నిన్న 2 గంటల 13 నిమిషాల పాటు లోక్ సభలో మాట్లాడిన మోదీ కనీసం రెండు నిమిషాలు మణిపూర్ గురించి మాట్లాడలేదన్నారు.
నిన్న నవ్వుతూ కనిపించిన ప్రధాని మోదీకి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. మణిపూర్ మండుతుంటే... ప్రజలు చనిపోతుంటే పార్లమెంటులో నవ్వుతూ కనిపించారని ఆరోపించారు. మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చివేశారన్నారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు గంటల్లో మణిపూర్‌ను చక్కదిద్దుతుందన్నారు. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర దళాలే ఆశ్చర్యపోయాయన్నారు. అగ్నిగుండంలా మారిన మణిపూర్‌ను చల్లార్చడానికి బదులు బీజేపీ మరింత అగ్గిరాజేసిందని ఆరోపించారు.