Komatireddy Venkat Reddy: షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా మంచిదే కదా!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- షర్మిలను కాంగ్రెస్‌లోకి అహ్వానించిన ఎంపీ కోమటిరెడ్డి
- తెలంగాణవ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేసిన ఎంపీ
- తమ పార్టీలోకి వస్తే కాంగ్రెస్‌కు లాభమని వ్యాఖ్య
- కేసీఆర్ బీఆర్ఎస్‌తో మహారాష్ట్ర వెళ్లినప్పుడు షర్మిల తెలంగాణ వస్తే తప్పేమిటని ప్రశ్న
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ప్రస్తుతం షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానం ఉంటుందని చెప్పారు. ఆమె తెలంగాణవ్యాప్తంగా ప్రజల కోసం పాదయాత్ర చేశారన్నారు. అలాంటి నాయకురాలు తమ పార్టీలోకి వస్తే లాభమే జరుగుతుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి మహారాష్ట్ర సహా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని, అలాంటప్పుడు షర్మిల తెలంగాణకు వస్తే తప్పేమిటి? అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు వచ్చినా, నాలుగు వందల ఓట్లు వచ్చినా మంచిదే కదా అన్నారు. పార్టీలో ఎవరు చేరినా అందర్నీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత పార్టీదే అన్నారు. షర్మిల చేరికపై అధిష్ఠానం అడిగినప్పుడు చెబుతానని, ఒకరినొకరు కలిసి బలపడాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు.